Rahul Gandhi: ఏటీసీ క్లియరెన్స్ ఆలస్యం.. రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ లో ఇష్యూ

కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది.

Update: 2024-11-15 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా హెలికాప్టర్ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. దీంతో, తిరుగు ప్రయాణంలో టేకాఫ్ కావడానికి 45 నిమిషాలు ఆలస్యమైంది. రాహుల్ గాంధీ షెడ్యూల్‌కి అంతరాయం కలిగించడానికి ఇలా టేకాఫ్‌ని ఆలస్యం చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏటీసీ నిర్ణయం రాహుల్ గాంధీ కదలికల కన్నా పీఎం మోడీ ఈవెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని ఆరోపించింది. ‘‘ప్రధాని మోడీ డియోఘర్‌‌లో ఉన్నందున, రాహుల్ గాంధీని ఆ ప్రాంతం దాటకుండా అనుమతించలేదు. అక్కడ ప్రోటోకాల్ మాకు అర్థమైంది కానీ, కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిందని, ఇలాంటి ఘటన ఏ ప్రతిపక్ష నాయకుడి కూడా ఎదురుకాలేదు. ఇది ఆమోదయోగ్యం కాదు.’’ అని మహాగామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ అన్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

ఇకపోతే, జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే తిరుగు ప్రయాణంలో ఆలస్యమయ్యింది. ఇదిలా ఉంటే, మరోవైపు డియోఘర్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయ్యేందుకు ఆలస్యమైంది. దీంతో ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లడం ఆలస్యంగా మారింది. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలకు ఈ నెల 13న తొలి విడత ఎన్నికలు జరగగా, రెండో విడత 20న జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి

Tags:    

Similar News