Rahul Gandhi : ఆ కేసులో నిందితులను కాపాడే యత్నం జరుగుతోంది : రాహుల్‌గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-08-14 14:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి ఘటనల గురించి తెలుసుకొని దేశంలోని మహిళలు, వైద్యలోకం అభద్రతా భావానికి లోనవుతున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీల్లో భద్రతా చర్యలు ప్రశ్నార్ధకంగా మారాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ కేసులోని కొందరు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జూనియర్ వైద్యురాలి మరణం సంభవించిన హాస్పిటల్, జిల్లా యంత్రాంగం తీరుపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ‘‘మెడికల్ కాలేజీల లాంటి ప్రదేశాల్లో డాక్టర్లే సేఫ్‌గా లేకుంటే.. సామాన్య పేరెంట్స్ వాళ్ల పిల్లలను చదువులకు ఎలా పంపుతారు ? నిర్భయ కేసు తర్వాత చట్టాలను కఠినతరం చేసినా ఇలాంటి దురాగతాలు ఎందుకు జరుగుతున్నాయి?’’ అని రాహుల్ ప్రశ్నించారు. ఇలాంటి అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు.

జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులకు ఐఎంఏ బృందం పరామర్శ

హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ సారథ్యంలోని బృందం బుధవారం పరామర్శించింది. అనంతరం అశోకన్ మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ వైద్యురాలి పేరెంట్స్ పడుతున్న బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు. తమ కూతురిపై అంతటి ఘోరం జరిగినా వెంటనే కనీస సమాచారాన్ని అందించలేదని వారు తమతో ఆవేదన వెళ్లబోసుకున్నారని ఆయన తెలిపారు. తమ బిడ్డ మరణించిన కొన్ని గంటల దాకా ఆవిషయాన్ని దాచి ఉంచడం అనుమానాలకు తావిస్తోందని చెప్పినట్లు అశోకన్ వెల్లడించారు. ఈఘటన తర్వాత కనీసం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వలేదన్నారు. బాధిత కుటుంబం ఆవేదనను విని తాము చలించిపోయామని ఆయన చెప్పారు. జూనియర్ వైద్యురాలి కుటుంబానికి తగిన సహాయ సహకారాలను అందించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు అశోకన్ కోరారు. ఈ కేసుపై సీబీఐ పారదర్శక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News