Rahul gandhi: బిహార్ కుల గణన బూటకం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
బిహార్‌లో నిర్వహించిన కుల గణన నకిలీదని అక్కడి ప్రజలను ఫూల్ చేయడానికి సర్వే చేపట్టారని రాహుల్ గాంధీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో నిర్వహించిన కుల గణన నకిలీదని, అక్కడి ప్రజలను ఫూల్ చేయడానికి సర్వే చేపట్టారని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. పాట్నాలో శనివారం జరిగిన సంవిధాన్ సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కుల గణన చేపట్టాలి, కానీ బిహార్‌లో కుల గణన నిర్వహించి అక్కడి ప్రజలకు మోసం చేశారని ఆరోపించారు. దళిత, వెనుకబడిన, ఆదివాసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనాల కోసం దేశవ్యాప్తంగా జనాభా గణనను నిర్వహించేలా చూస్తామన్నారు. ప్రయివేటు రంగంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు అంతగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 500 ప్రయివేట్ కంపెనీల జాబితాను పరిశీలిస్తే, అగ్రస్థానంలో ఉన్న ఏ ఒక్కటీ ఈ వర్గాలకు చెందలేదన్నారు. కుల గణన వల్ల రాజకీయంగా నష్టపోయినా దానిని జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ సర్వే ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని భావజాలం ప్రతి వ్యక్తికి చేరాలని కోరుకుంటున్నామన్నారు.