మిస్సైల్ ఎటాక్‌కు ఇండియా రెడీ.. మోడీకి ఇమ్రాన్‌ఖాన్ ఫోన్ !
దిశ, నేషనల్ బ్యూరో : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల గురించి అందరికీ తెలుసు.
దిశ, నేషనల్ బ్యూరో : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల గురించి అందరికీ తెలుసు. ఆ సమయంలో చోటుచేసుకున్న ఒక కీలకమైన అంశం తాజాగా తెరపైకి వచ్చింది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్ర దాడి జరగగా.. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్‌ను భారత్ నిర్వహించింది. ఈక్రమంలో కూలిపోయిన భారత యుద్ధ విమానంలోని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నాక ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను పెంచే పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో 2019 ఫిబ్రవరి 27న అర్ధరాత్రి టైంలో నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భయాందోళనతో ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడేందుకు ట్రై చేశారట. ఈ విషయాన్ని అప్పట్లో పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా తన పుస్తకం ‘ది యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్ బెట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’లో ప్రస్తావించారు.
పుస్తకం ప్రకారం..
ఆ పుస్తకం ప్రకారం.. ‘‘అప్పటి పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహమినా జన్‌జువాకు పాక్ సైన్యం నుంచి ఒక సందేశం అందింది. భారత్ వైపు నుంచి 9 క్షిపణులను పాకిస్తాన్ వైపు గురిపెట్టి ఉంచారు.. అవి ఏ క్షణమైనా పేలొచ్చు అనేది ఆ సందేశం సారాంశం. ఇలా పరిస్థితి చేజారుతుండడంతో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ హై కమిషనర్ సోహాయిల్ మహమూద్ నుంచి ఢిల్లీలోని భారత హైకమిషనరేట్‌లో ఉన్న నాకు ఫిబ్రవరి 27న అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని మోడీతో మాట్లాడాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. మిద్దెపైన ప్రధాని ఉన్నారేమోనని చూశాను. ఆయన లేరన్న విషయాన్ని మహమూద్‌కు చెప్పాను. ఇమ్రాన్ ఖాన్ ఏదైనా అత్యవసర సందేశం చెప్పదలిస్తే నాకు చెబితే నేను ప్రధాని మోడీకి తెలియచేస్తానని చెప్పాను. ఆ రాత్రి నాకు మళ్లీ ఫోన్ కాల్ రాలేదు’’ అని బిసారియా తన పుస్తకంలో వివరించారు. అయితే ఆ రోజు రాత్రి ఢిల్లీలోని అమెరికా, బ్రిటన్ రాయబారులు భారత విదేశాంగ శాఖ కార్యదర్శితో మాట్లాడారని.. ఉద్రిక్తతను తగ్గించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని వారు చెప్పారని పుస్తకంలో వివరించారు. ఆ మరుసటి రోజే (2019 ఫిబ్రవరి 28న) తమ బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన ప్రధాని మోడీ ఈ ఘటనను ప్రస్తావిస్తూ..‘‘ అదృష్టవశాత్తు పైలట్‌ను భారత్‌కు తిప్పి పంపిస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. లేకపోతే అది రక్తపాత రాత్రిగా మారి ఉండేది’’ అని కామెంట్ చేశారు.