ఎన్నికల వేళ రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ ఇళ్లలో ఈడీ సోదాలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌లో ఈడీ దాడులు పెద్ద చర్చనీయాంసంగా మారింది.

Update: 2023-10-26 07:43 GMT

జైపూర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌లో ఈడీ దాడులు పెద్ద చర్చనీయాంసంగా మారింది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షా పత్రాల లీక్‌ వ్యవహారంలో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాసరకు చెందిన ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మ‌రో ఆరు ప్ర‌దేశాల్లోనూ త‌నిఖీలు చేపట్టారు. ఆయనతో పాటు మరికొందరు నేతల నివాసాలు, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. అలాగే, మహువా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఓంప్రకాష్ హూడాకు సంబంధించిన నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.

ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల ప‌రీక్ష పేప‌ర్ లీకేజీపై న‌మోదు అయిన కేసులు ఆధారంగా ఈడీ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌తో ఒక్కో పేపర్‌ను రూ. 10 ల‌క్ష‌ల‌కు అమ్ముకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తవారం ఈడీ సోదాల్లో రూ. 12 ల‌క్ష‌ల న‌గ‌దు ల‌భ్య‌మైంది. 7 చోట్ల నిర్వ‌హించిన త‌నిఖీల్లో వివిధ కీల‌క‌మైన డాక్యుమెంట్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇక, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దినేశ్ ఖోద‌నియా ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేప‌ట్టారు. మరోవైపు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు సమాచారం. అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు

Tags:    

Similar News