Priyanka: వ్యాపార వేత్తల ప్రయోజనాలకే మోడీ ప్రాధాన్యత.. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ

మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల శ్రేయస్సు కంటే వ్యాపార వేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.

Update: 2024-11-03 09:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ (Pm modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం(Central government) దేశ ప్రజల శ్రేయస్సు కంటే బడా వ్యాపార వేత్తల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మండిపడ్డారు. ప్రజలను విభజించడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామ్య సంస్థలను అణచివేయడం ద్వారా అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. వయనాడ్ (Wayanad) లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు. ‘మోడీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల కోసం మాత్రమే పని చేస్తోంది. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడం మోడీ ఉద్దేశం కాదు. కొత్త ఉద్యోగాలు సృష్టించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయన పని చేయడం లేదు. మెరుగైన ఆరోగ్యం, విద్య కోసం కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజలను విభజించి అధికారంలో కొనసాగేందుకు మాత్రమే మొగ్గుచూపుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

వయనాడ్ ప్రజలు అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. ‘ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవించే భూమి వయనాడ్. పజాస్సి రాజా(pajapsi raja), తలక్కల్ చంతు(Thalakkal chanthu), ఎడచెన కుంకన్(Yedachena kunkan) వంటి నాయకుల స్ఫూర్తి కలిగిన బలమైన చరిత్ర మీకు ఉంది. మీరు ఎల్లప్పుడూ సరైన దాని కోసం పోరాడారు. అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు. సమానత్వం కోసం నినదించారు’ అని కొనియాడారు. వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం మెండుగా ఉందన్నారు. కాగా, ఈ నెల 13న వయనాడ్ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

Tags:    

Similar News