రాహుల్, ప్రియాంక ‘ఉత్తర’ అస్త్రం.. ఇద్దరి పోటీ అక్కడి నుంచే !!
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ప్రియాంకాగాంధీ తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడైంది. తన తల్లి సోనియాగాంధీ దశాబ్దాల తరబడి లోక్‌సభకు ఎన్నికైన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ స్థానం నుంచి ప్రియాంక బరిలోకి దిగనున్నారు. ఇదే స్థానం నుంచి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మూడుసార్లు విజయం సాధించారు. తర్వాత సోనియా సైతం ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ఇటీవల సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే రాజస్థాన్ కోటాలో రాజ్యసభకు పంపింది. ప్రియాంకా గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లోనే మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తున్న అభ్యర్ధుల జాబితాలో రాయ్ బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ పేరు ఉందని తెలుస్తోంది.
అమేథీలో అమీతుమీకి రాహుల్ రెడీ..
ఇక రాహుల్ గాంధీ తన పాత స్థానం అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి మరోసారి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడ్ (కేరళ) నుంచి రాహుల్ పోటీచేశారు. అయితే అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. వయనాడ్ నుంచి గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అంతక్రితం అమేథీ నుంచి మూడుసార్లు పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన ట్రాక్ రికార్డు రాహుల్‌కు ఉంది. ఈనేపథ్యంలో ఈదఫా స్మృతి ఇరానీకి గట్టిపోటీ ఇచ్చి సత్తా చాటుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఉత్తరభారత దేశం బీజేపీకి ఆయువుపట్టుగా మారిన ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఈసారి యూపీ నుంచే పోటీ చేయాలని రాహుల్, ప్రియాంక డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.