వయనాడ్ నుంచి పోటీకి ప్రియాంక గాంధీ..?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా రెండు చోట్ల కూడా ఆయన ఘన విజయం సాధించారు

Update: 2024-06-14 05:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా రెండు చోట్ల కూడా ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఎంపీగా కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడిన రాహుల్ ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని అన్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, రాహుల్ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. 2024 ఎన్నికల్లో ప్రియాంక అమేథీ నుంచి పోటీలో ఉంటారని మొదట్లో అంతా భావించారు. లేదంటే వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వినిపించినప్పటికీ, ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఇండియా కూటమి తరపున దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే ఇప్పుడు రాహుల్ రాజీనామతో వయనాడ్ స్థానం ఖాళీ అయితే అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, దీంతో ఆమె లోక్‌సభలో అడుగుపెట్టడానికి వీలవుతుంది.

కాంగ్రెస్ నాయకురాలు రాయ్‌బరేలీ, అమేథీలలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించింది, ఈ రెండింటిలోనూ కాంగ్రెస్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ కూడా యూపీ వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రియాంక పాత్రను ప్రశంసించారు. ఇటీవల రాహుల్ మాట్లాడిన దాని ప్రకారం, యూపీ కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన రాయబరేలీకి వెళ్లడం దాదాపు ఖాయమని వర్గాలు తెలిపాయి. ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీనిని ధ్రువీకరించినట్లు ప్రకటనలు చేశారు.

అమేథీలో స్మృతి ఇరానీకి ఓటమిని అందించిన గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడైన కిషోరి లాల్ శర్మ రాహుల్ గాంధీని రాయబరేలీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. అలాగే, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె సుధాకరన్ నాయకుడు మాట్లాడుతూ, దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఉంటారని ఊహించలేము కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి బరిలోకి దిగి గెలిచినట్లయితే లోక్‌సభలో ఆమెచేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొంటున్నారు.


Similar News