Priyanka Gandhi: ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు.. వయనాడ్ ప్రజలకు ప్రియాంక లేఖ

వయనాడ్ ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

Update: 2024-10-26 12:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్(Wayanad) ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) ఆ నియోజకవర్గ ప్రజలకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే తనకు కొత్త అని కానీ ప్రజల తరఫున పోరాడటం మాత్రం కొత్తేమీ కాదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో లేఖను పోస్ట్ చేశారు. ‘వయనాడ్‌కు గొప్ప ప్రకృతి సౌందర్యం ఉంది. అనేక సహజ వనరులు ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించడం, పర్యావరణాన్ని గౌరవించే మీ సంస్కృతి ఇక్కడి అభివృద్ధికి ప్రధానమైందని నమ్ముతున్నా. మీలో చాలా మందిని కలవడానికి, అందరితో మాట్లాడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు.

‘ప్రజాస్వామ్యం(Democracy), న్యాయం, భారత రాజ్యాంగం(indian constution)లో పొందుపరచబడిన విలువల కోసం పోరాటం నా జీవితంలో ముఖ్యమైంది. వయనాడ్ ప్రజల మద్దతుతో భవిష్యత్ కోసం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను ఎదురు చూస్తున్నా. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికలో ఎంపీగా ఎన్నుకుంటే బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుంది. ప్రజాప్రతినిధిగా తన తొలి ప్రయాణంలో వయనాడ్ ప్రజలు నా మార్గదర్శకులు, ఉపాధ్యాయులు’ అని తెలిపారు. కొన్ని నెలల క్రితం రాహుల్‌(Rahul)తో కలిసి చురమల, ముండక్కై వెళ్లిన విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. అక్కడ కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు అనుభవించిన నష్టాన్ని దగ్గరగా చూశానని తెలిపారు. అయినప్పటికీ ఆ టైంలో ప్రజలు చూపించిన ధైర్య సాహసాలు చూసి చలించి పోయానని పేర్కొన్నారు.

Tags:    

Similar News