President Murmu: సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రపంచమంతా నాలుగో పారిశ్రామిక విప్లవ యుగంలో ఉందని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.

Update: 2024-08-21 13:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచమంతా నాలుగో పారిశ్రామిక విప్లవ యుగంలో ఉందని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతుందని చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న జేసీ బోస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదో స్నాతకోత్సవానికి ఆమె బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముర్ము ప్రసంగించారు. సాంకేతికత అభివృద్ధి చెందిన కారణంగా అనేక ప్రగతి దారులు తెరుచుకున్నాయన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ విస్తరించడం వల్ల అనేక ఆన్ లైన్ ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. టెక్నాలజీని ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. దానిని తప్పుగా వాడితే సమాజ వినాశనానికి దారి తీస్తుందని నొక్కి చెప్పారు.

యువతను నైపుణ్యం, స్వావలంబన కలిగిన వారిగా తయారు చేయడంలో బోస్ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. దేశ విదేశాల్లో అనేక రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్న పూర్వ విద్యార్థుల జాబితాను ఈ విశ్వవిద్యాలయం కలిగి ఉందని తెలిపారు. పూర్వ విద్యార్థుల సంఘం సహకారం మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు జగదీష్ చంద్రబోస్ జీవితం, ఆయన రచనలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

Tags:    

Similar News