పీఓకే విదేశీ భూభాగం.. ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపిన పాక్ ప్రభుత్వం
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమ భూభాగం కాదని దాయాది దేశం ఎట్టకేలకు అంగీకరించింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమ భూభాగం కాదని దాయాది దేశం ఎట్టకేలకు అంగీకరించింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పీవోకేకు చెందిన జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా ఈ విషయాన్ని తెలిపింది. పీవోకేపై పాకిస్థాన్ ప్రభుత్వం తీరు, పాక్ బలగాల మోహరింపునకు సంబంధించిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో, మే 15న అహ్మద్ ఫర్హాద్ షాను ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన భర్తను కిడ్నాప్ చేసిందని అహ్మద్ ఫర్హాద్ షా భార్య ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఫర్హాద్ షాను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి మొహ్సిన్ అక్తర్ కయానీ ఆదేశించారు.
మరోవైపు, పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ ప్రభుత్వం తరుఫున కోర్టులో వాదించారు. పీవోకేలో పోలీసుల కస్టడీలో ఫర్హాద్ షా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సొంత రాజ్యాంగం, సొంత కోర్టులున్న పీవోకే విదేశీ భూభాగమని చెప్పారు. దీనిపై పాకిస్థాన్‌కు ఎలాంటి అధికార పరిధి లేదని స్పష్టం చేశారు. పీవోకేలోని పాకిస్థాన్ కోర్టుల తీర్పులను విదేశీ కోర్టుల తీర్పులుగా పరిగణిస్తారని అన్నారు. దీంతో, అహ్మద్ ఫర్హాద్ షాను ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పరచలేమని కోర్టుకు వెల్లడించారు. అదనపు అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. పీవోకే విదేశీ భూభాగమైతే, పాక్ బలగారు, రేంజర్లు.. అక్కడికి ఎలా వెళ్లారని ప్రస్నించారు. పాక్ గూఢచార సంస్థలు పీవోకే ప్రజలను కిడ్నాప్ చేస్తున్నాయని ఆరోపించారు.