ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కశ్మీర్ లోయ పర్యటన
మార్చ్ 7న శ్రీనగర్‌లో జరగబోయే ర్యాలీ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, 2019లో రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్ లోయను సందర్శించనున్నారు. మార్చ్ 7న శ్రీనగర్‌లో జరగబోయే ర్యాలీ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ పర్యటన సందర్భంగా పలు పథకాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. 'ప్రధాని కశ్మీర్‌లో ప్రసంగించాలని ఇక్కడి ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మార్చి 7న ఆయన ర్యాలీలో ప్రసంగిస్తారని ' జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా చెప్పారు. శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌ను ప్రధాని పర్యటన వేదికగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కశ్మీర్ లోయ ప్రాంతంలో ఇప్పటికే హై-అలర్ట్ ప్రకటించినట్టు సమాచారం. పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల ఫిబ్రవరి 20న జమ్మూ పర్యటనలో ప్రధాని మోడీ రూ. 32 వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే.