బీజేపీ నేత 'సేలం రమేష్'ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన ప్రధాని మోడీ

2013లో సేలంలో హత్యకు గురైన 'ఆడిటర్' వీ రమేష్‌ను గుర్తుచేసుకున్న మోడీ ప్రసంగాన్ని కాసేపు ఆపిన తర్వాత తిరిగి ప్రారంభించారు

Update: 2024-03-19 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని సేలం జిల్లా పర్యటనలో భావోద్వేగానికి లోనయ్యారు. 2013లో సేలంలో హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 'ఆడిటర్' వీ రమేష్‌ను గుర్తుచేసుకున్న మోడీ ప్రసంగాన్ని కాసేపు ఆపిన తర్వాత తిరిగి ప్రారంభించారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన మోడీ.. '10 ఏళ్ల క్రితం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నాయకుడు, ఆడిటర్ రమేశ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. పార్టీ కోసం వీ రమేష్ పగలు రాత్రి పనిచేశారు. పార్టీకి అంకితమైన నాయకుడు. గొప్ప వక్త, చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి. నేను రమేష్‌కు నివాళులర్పిస్తున్నాను' అని చెప్పారు. 2013లో సేలం పట్టణంలోని మరవనేరి ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 'ఆడిటర్' వీ రమేష్ (54)ను గుర్తు తెలియని దుండగులు అతని ఇంటి ప్రాంగణంలోనే నరికి చంపారు. వృత్తిరీత్య ఆడిటర్ అయిన రమేష్ బీజేపీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సభలో మోడీ మరో బీజేపీ నేత కేఎన్ లక్ష్మణన్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరణలో ఆయన చేసిన కృషి మర్చిపోలేమని, రాష్ట్రంలో అనేక పాఠశాలలను కూడా ప్రారంభించారని మోడీ పేర్కొన్నారు. కె ఎన్ లక్ష్మణన్ 2020, జూన్‌లో సేలంలోని తన నివాసంలో వయస్సు సంబంధిత సమస్యల కారణంగా మరణించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీపై విశ్వాసం ఉంచుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News