PM Narendra Modi :ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్.. మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రచారంలో పరస్పర విమర్శలు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని వాయువ్య ప్రాంతంలో ట్రైబల్ కమ్యూనిటీ అధికంగా ఉండే ధూలేలో ప్రధాని మోడీ శుక్రవారం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ(PM Modi) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని వాయువ్య ప్రాంతంలో ట్రైబల్ కమ్యూనిటీ అధికంగా ఉండే ధూలేలో ప్రధాని మోడీ శుక్రవారం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. హస్తం పార్టీ కులాల మధ్య చిచ్చుపెడుతోందని.. తద్వారా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే అవకాశాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. మరోసారి మహాయుతి కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఏక్ హే తో సేఫ్ హే(ఐకమత్యంగా ఉంటే.. సురక్షితంగా ఉంటాం)అని నినదించారు. కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెట్టే డేంజర్ గేమ్ ఆడుతుందని సీరియస్ అయ్యారు. దళితులు, అణగారిన వర్గాలు, ఆదివాసీలు అభివృద్ధి చెందడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. ఇదే కాంగ్రెస్ చరిత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమి రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధికి గ్యారంటీ ఇస్తుందన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను సైతం రద్దు చేస్తుందన్నారు. మహారాష్ట్రలో సుపరిపాలన కేవలం మహాయుతి కూటమితోనే సాధ్యమన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమి వాహనానికి వీల్స్, బ్రేక్లు లేవని.. డ్రైవర్ సీటు కోసం ఫైట్ నడుస్తోందని సెటైర్లు వేశారు.
కులగణన చేపట్టాల్సిందే..
రాహుల్(Rahul Gandhi) గాంధీ జార్ఖండ్‌లో మాట్లాడుతూ.. ఆదివాసీల నుంచి జల్, జంగల్, జమీన్‌ను బీజేపీ లాక్కోవడానికి చూస్తున్నాయని ఆరోపించారు. భూమి, అడవి, నీరు తమకే చెందినవిగా బీజేపీ భావిస్తున్నందున అభివృద్ధి పేరిట వీటిని లాక్కోవడానికి చూస్తున్నారని తెలిపారు. పటిష్టమైన విధానాల రూపకల్పనకు కాంగ్రెస్, ఇండియా కూటమి కులగణన చేపట్టాలని చూస్తుంటే బీజేపీ మాత్రం క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న వారిపై రాళ్ల దాడి చేయాలని చూస్తోందన్నారు. 90 శాతం మంది ప్రజలు వ్యవస్థ బయటకు నెట్టివేయబడ్డారని, పాలన ఫలితాలు పొందడం లేదని.. కుల గణన, సామాజిక ఆర్థిక సర్వే ద్వారా అట్టడుగు వర్గాలు, మహిళల అభివృద్ధి సాధ్యమన్నారు. దళితులు, ఓబీసీలు, ట్రైబల్స్, మహిళలు, మైనార్టీలు ఎంత మంది ఉన్నారనే డేటా తమకు కావాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తాము కుల గణన డిమాండ్ చేస్తున్నామన్నారు.