42 ఏళ్లలో తొలి ప్రధానిగా మోదీ రికార్డ్! అక్కడ ఫస్ట్ టైం ఎలక్షన్ ర్యాలీ

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (శనివారం) పర్యటించనున్నారు.

Update: 2024-09-14 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు (శనివారం) పర్యటించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం దోడాలో నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు. కాగా.. గత 42 ఏళ్లలో దోడా ప్రాంతాన్ని ఓ ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారని కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌చార్జ్ జీ కిషన్ రెడ్డి తెలిపారు.

‘‘దోడా ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఎన్నికల సభ నిర్వహించనున్నారు. ఇది చాలా అరుదైన విషయం. గత 42 ఏళ్లలో ఏ ప్రధాని కూడా దోడా ప్రాంతాన్ని సందర్శించ లేదు. చివరిసారిగా 1982లో ఈ ప్రాంతంలో అప్పటి ప్రధాని (ఇందిరా గాంధీ) పర్యటించడం జరిగింది.’’ అని కిషన్ రెడ్డి (Kishan Reddy) చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే బీజేపీ (BJP) స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. దోడాలోని స్పోర్ట్స్ స్టేడియంలో తన తొలి ఎలక్షన్ ర్యాలీ నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ఈ ఎన్నికల ర్యాలీ (Election Rally) అనంతరం 19వ తేదీన శ్రీనగర్‌ (Srinagar)లో కూడా మోదీ పర్యటించనున్నారు. 


Similar News