సౌత్, నార్త్, ఈస్ట్‌లలో మరో మూడు బుల్లెట్ రైళ్లకు ప్రధాని మోడీ హామీ

దక్షిణ భారత్‌తో పాటు ఉత్తర, తూర్పు భారత్‌లకు ఈ రైలు సేవలు విస్తరించనున్నట్టు మోడీ పేర్కొన్నారు.

Update: 2024-04-14 09:15 GMT
సౌత్, నార్త్, ఈస్ట్‌లలో మరో మూడు బుల్లెట్ రైళ్లకు ప్రధాని మోడీ హామీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ లోక్‌సభ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో మరో మూడు బుల్లెట్ రైలు కారిడార్‌లకు హామీ ఇచ్చారు. అహ్మదాబాద్‌, ముంబై బుల్లెట్ రైలు మొదటి కారిడార్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని, మరో మూడు కారిడార్‌లకు సంబంధించిన సర్వే పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. దక్షిణ భారత్‌తో పాటు ఉత్తర, తూర్పు భారత్‌లకు ఈ రైలు సేవలు విస్తరించనున్నట్టు మోడీ పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన అధ్యయనం కూడా త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. 'దేశంలో మొదటి బుల్లెట్ రైలు కారిడార్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ అనుభవంతో నార్త్, సౌత్, ఈస్ట్ భారత్‌లకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తెస్తామని, దీనికోసం సర్వే పనులు మొదలవుతాయని' వివరించారు. కాగా, ముంబై-అహ్మదాబాద్ మధ్య జరుగుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రూ. 1.08 లక్షల కోట్లతో చేపడుతున్నారు. దీన్ని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) నిర్మిస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు 2026లో ట్రాక్‌పైకి వస్తుందని, ఇది సూరత్ నుంచి ఒక సెక్షన్‌లో నడుస్తుందని ఆయన చెప్పారు. 

Tags:    

Similar News