Pm modi: ఆరు దశాబ్దాల్లో 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు.

Update: 2024-12-14 17:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ రక్తం వారి ముఖంలోనే కనపడుతోందని విమర్శించారు. నెహ్రూ(Nehru) నుంచి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) వరకు అందరూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారని చరిత్రలో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్ సభలో శనివారం నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోడీ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుటుంబం ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని ఫైర్ అయ్యారు. ఆరు దశాబ్దాల్లో రాజ్యాంగాన్ని దాదాపు 75 సార్లు మార్చారని దుయ్యబట్టారు. ‘1951లో ఎన్నికైన ప్రభుత్వం లేనప్పుడు నెహ్రూ తన ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించారు. ఆ టైంలో భావప్రకటనా స్వేచ్చపై దాడి జరిగింది. ఇది రాజ్యాంగ నిర్మాతలను అవమానించడమే’ అని వ్యాఖ్యానించారు. దేశ తొలి ప్రధాని నాటిన విత్తనానికి మరో ప్రధాని ఇందిరాగాంధీ ఎరువులు, నీరు అందించారని ఫైర్ అయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు, తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే 1971లో దేశంలో ఎమర్జెన్సీ విధించారని ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజల హక్కులు హరించబడ్డాయని, వేలాది మందిని జైళ్లలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని జైలుగా మార్చి పౌర హక్కులను అణచివేశారన్నారు.

75వ వార్షికోత్సవం ఎంతో గర్వకారణం

ప్రపంచ ప్రజాస్వామ్య భూభాగంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని మోడీ కొనియాడారు. శతాబ్దాల నాటి ప్రజాస్వామ్య సంప్రదాయాల కారణంగా ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని అభివర్ణించారు. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం భారతదేశానికే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వారికి ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. స్వాతంత్ర్య సమయంలో ఎదుర్కొన్న సందేహాలను, సవాళ్లను అధిగమించేందుకు రాజ్యాంగం దోహదపడిందని, 75 ఏళ్లలో అసాధారణ విజయాలను సాధించిందని తెలిపారు. దేశాన్ని నిర్మించడంలో ఎంతో సహాయపడిందని తెలిపారు. దశాబ్దాల తర్వాత అనేక దేశాలు మహిళలకు ఓటు హక్కును కల్పించగా, భారత రాజ్యాంగం మాత్రం మొదటి నుంచీ ఈ హక్కులను కల్పించిందని చెప్పారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి కూడా రాజ్యాంగమే దోహద పడిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని సభలో 11 తీర్మానాలను ప్రవేశపెట్టారు.

రాజ్యాంగ పరిషత్ యూసీసీ అమలును కోరుకుంది

దేశంలో ఎన్నుకోబడిన ప్రభుత్వం ద్వారా యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాలని రాజ్యాంగ పరిషత్ కోరుకుందని, బీఆర్ అంబేడ్కర్‌ సైతం అన్ని మతాల కోసం యూసీసీని గట్టిగా సమర్థించారని మోడీ నొక్కి చెప్పారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు సైతం ఎన్నోసార్లు చెప్పిందని గుర్తు చేశారు. రాజ్యాంగ స్పూర్తిని, రాజ్యాంగ నిర్మాతలను దృష్టిలో ఉంచుకుని యూసీసీ అమలుకు తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నామన్నారు. రాజ్యాంగ రూపకర్తలు దేశ ఐక్యత పట్ల సున్నితంగా ఉన్నారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ నిర్మాతల హృదయాల్లో ఐక్యత ఉండేదని, కానీ ఆ తర్వాత దేశ ఐక్యత అనే ప్రాథమిక భావనపైనే అతిపెద్ద దాడి జరిగిందన్నారు. దేశ ఐక్యతకు ఆర్టికల్ 370 గోడలా మారిందని, అందుకే దానిని మట్టిలో కలిపేశామని స్పష్టం చేశారు.

మను స్మృతికి, రాజ్యాంగానికి మధ్య పోరాటం: రాహుల్ గాంధీ

రాజ్యాంగంపై చర్చలో భాగంగా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం మను స్మృతికి, రాజ్యాంగానికి మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిశీలిస్తే మహాత్మాగాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఆలోచనలు రాజ్యాంగంలో కనిపిస్తున్నాయని, అయితే ఈ ఆలోచనలు శివుడు, గురునానక్, లార్డ్ బసవన్న, కబీర్ మొదలైన వారి నుంచి వచ్చాయన్నారు. ప్రాచీన వారసత్వం లేకుండా మన రాజ్యాంగం తయారయ్యేది కాదన్నారు. సావర్కర్, ఏకలవ్య-ద్రోణాచార్య కథను వివరించిన రాహుల్ బీజేపీ ప్రభుత్వం యువత బొటనవేలును నరికిస్తోందని ఆరోపించారు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలు కోసుకుని అతని ప్రతిభను తీసివేసినట్లే బీజేపీ ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్‌తో యువత బొటనవేలును కోసేస్తోందని మండిపడ్డారు. ‘భారత రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని సావర్కర్ తన రచనల్లో స్పష్టంగా చెప్పారు.ఇప్పుడు సావర్కర్ చెప్పినదానిని నమ్ముతోందా.. లేదా రాజ్యాంగాన్ని విశ్వసిస్తోందా’ అని ప్రశ్నించారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రశంసిస్తే సావర్కర్‌ను వ్యతిరేకించినట్టేనని చెప్పారు. ఎప్పటికైనా దేశంలో కుల గణనను అమలు చేస్తామని, 50శాతం రిజర్వేషన్ల గోడను కూల్చేస్తామని వెల్లడించారు.

రాజ్యాంగంపై ముగిసిన చర్చ

లోక్ సభలో రెండు రోజుల పాటు రాజ్యాంగంపై జరిగిన చర్చ శనివారం ముగిసింది. రెండో రోజు చర్చను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించగా పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం మోడీ ప్రసంగించారు. ఆ తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది. మోడీ గంటా 50 నిమిషాల పాటు మాట్లాడారు. కాగా, రాజ్యసభలోనూ రెండు రోజుల పాటు రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఈ సభలోనూ మోడీ సమాధానం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 


Tags:    

Similar News