సాదా సీదాగా బ్రిటన్ ప్రథమ మహిళ: ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో ప్రత్యక్షం

బ్రిటన్ ప్రథమ మహిళ అయిన అక్షత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తి తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో పర్యటించారు.

Update: 2024-02-27 03:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ ప్రథమ మహిళ అయిన అక్షత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తి తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరులో పర్యటించారు. తండ్రి నారాయణ మూర్తి, తల్లి సుధామూర్తి, కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి నగరంలోని రాఘవేంద్ర మఠంలో పుస్తకాలను తనిఖీ చేస్తూ కనిపించారు. ఆ టైంలో ఎటువంటి భద్రత లేకుండా, సాధారణ దుస్తుల్లో మఠం వద్ద కుటుంబ సభ్యులతో గడపడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి దీనిని షేర్ చేస్తూ..‘యూకే ప్రధాని రిషి సునాక్ భార్య, పిల్లలు బెంగళూరులోని రాఘవేంద్ర మఠం వద్ద కనిపించారు. ఎటువంటి సెక్యురిటీ లేకుండా ఉన్నారు. ఇది వారి సింప్లిసిటీకి నిదర్శనం’ అని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ఎప్పడు చిత్రీకరించారో అనే విషయం తెలియదు. కానీ అత్యంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ నారాయణమూర్తి ఫ్యామిలీ సాధా సీధా వ్యక్తుల్లా ఉండటం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి నుంచి చాలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ఈ నెల మొదట్లోనూ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణమూర్తితో కలిసి బెంగళూరులోని ఓ బేకరీలో ఐస్ క్రీం తింటూ కనిపించారు. దీనిని సైతం ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది. అంతేగాక నగరంలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో రచయిత చిత్ర బెనర్జీ దివాకరుణి తాజా పుస్తకం ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అక్షతా హాజరయ్యారు. కాగా, యూకే ప్రస్తుత ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునాక్‌ను అక్షతా మూర్తి 2009లో వివాహం చేసుకున్నారు. పీఎంగా సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ మొదటి సారిగా గతేడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సు నిమిత్తం భారత్‌కు వచ్చారు. రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని కూడా సందర్శించి ప్రార్థనలు చేశారు.

Tags:    

Similar News