కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్: తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అనంతరం ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.

Update: 2024-05-13 07:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అనంతరం ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైన నేపథ్యంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మాత్రమే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పిటిషన్‌కు చట్టపరమైన అర్హత లేదని పేర్కొంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. అయితే అరెస్టైన టైంలో కూడా కేజ్రీవాల్ సీఎం పదవికి రిజైన్ చేయలేదని సందీప్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అంతేగాక పనికిమాలిన వ్యాజ్యం వేసినందుకు రూ. 50,000 జరిమానా కూడా విధించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించడనికి చట్టపరమైన హక్కులు ఏమున్నాయని ప్రశ్నించింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టి వేసింది.

Tags:    

Similar News