PM Modi: ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపే పార్టీలను తిరస్కరించిన జమ్మూకశ్మీర్ ప్రజలు

అబ్దుల్లాలు, ముఫ్తీలు, గాంధీల చేతుల్లో మరో తరాన్ని నాశనం చేయడానికి తాను అనుమతించబోనని..

Update: 2024-09-19 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్‌ నమోదు కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. రాళ్లు రువ్వేవారు, ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపే పార్టీల తిరస్కరణకు ఇది ప్రతీక అని అన్నారు. గురువారం శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. 'జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ బంపర్ ఓటింగ్ ద్వారా రాళ్ల దాడి, ఉగ్రవాదంపై సానుభూతి చూపే పార్టీలను తిరస్కరించినట్టు అయింది. సురక్షితమైన, మోడీ హామీలపై ఇక్కడి ప్రజలు పూర్తి విశ్వాసం చూపారు. అబ్దుల్లాలు, ముఫ్తీలు, గాంధీల చేతుల్లో మరో తరాన్ని నాశనం చేయడానికి తాను అనుమతించబోనని, శాంతి పునరుద్ధరణకు తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ అంతటా పాఠశాలలు, కళాశాలలు సజావుగా నడుస్తున్నాయి. పిల్లల వద్ద పెన్నులు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వారు ఈరోజు ఎలాంటి కాల్పుల ఘటనలను చూడటంలేదు, అందుకు బదులు కొత్త పాఠశాలలు, కొత్త కళాశాలలు, ఎయిమ్స్, వైద్య కళాశాలలు, ఐఐటీలు వారికి అందుబాటులో ఉన్నట్టు మోడీ ప్రసంగించారు. ఒకప్పుడు లాల్ చౌక్‌కు రావడం, ఇక్కడ త్రివర్ణ పతాకం ఎగరేయడం ప్రాణహాని కలిగించేదిగా ఉండేది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ కృషి కారణంగా పరిస్థితులు మారాయి. శ్రీనగర్‌లో ఈద్, దీపావళి వంటి వైభవం చూస్తున్నామని మోడీ అన్నారు. సెప్టెంబర్ 18న ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో 61.13 శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే. తర్వాతి రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనుండగా, అక్టోబర్ 8న కౌంటింగ్ జరగనుంది. 

Tags:    

Similar News