పతంజలి వ్యవహారంలో ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ తీరుపై సుప్రీంకోర్టు అసహనం
తొమ్మిది నెలల కాలంలో పతంజలి సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది.
దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదోవ పట్టించే పతంజలి యాడ్స్ కేసు వ్యవహారంలో భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ అనుసరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు లైసెన్సింగ్ అథారిటీ ప్రక్రియ ప్రారంభించిందని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 'మీకు చేయాలనిపించినప్పుడు ఎంత వేగంగానైనా పనిచేస్తారు. లేదంటే నిర్లక్ష్యంగా ఉంటారు. తొమ్మిది నెలల కాలంలో పతంజలి సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? సానుభూతి కావాలనుకుంటే కోర్టుకు నిజాయితీగా ఉండండి' అంటూ ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. మీరు చట్టం ప్రకారం చర్య తీసుకున్నారా అనేది మా ప్రధాన ఆందోళన. కాబట్టి ఈ చర్యలు చట్ట ప్రకారం తీసుకున్నారా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విచారణకు హాజరైన పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలు తాము పత్రికల్లో ఇచ్చిన బహిరంగ క్షమాపణల డిజిటల్ కాపీలను సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపి అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు ఒరిజినల్ కాపీలకు బదులు ఈ-కాపీలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇది కూడా కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ కేసులో మీకు ఇదే చివరి అవకాశమని, పత్రికల్లో ఇచ్చిన క్షమాపణల ఒరిజినల్ పేజీలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మే 14కు వాయిదా వేసింది.