పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట.. సైఫర్ కేసులో నిర్దోషిగా తీర్పు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట దక్కింది. సైఫర్ కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2024-06-03 13:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట దక్కింది. సైఫర్ కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో పాకిస్థాన్ విదేశాంగశాఖ మాజీ మంత్రి మహమూద్ ఖురేషీని కూడా నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్ దగ్గర దౌత్య పరమైన రహస్యాలు ఏమీ లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.

సైఫర్ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు ఏంటంటే?

సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతడ్ని స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఇదే కేసులో విదేశాంగ మాజీ మంత్రి మహమూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష పడింది. స్పెషల్ కోర్టు తీర్పుపై ఇమ్రాన్ ఖాన్.. హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులోనే ఆయనకు ఉపశమనం దక్కింది. ఈకేసులో ఉపశమనం ఉన్నప్పటికీ.. ఇమ్రాన్ జైళ్లోనే ఉండనున్నారు. ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధంగా మూడో పెళ్లి చేసుకున్నారనే కేసులో జైళ్లో ఉన్నారు. ఇకపోతే, ఖురేషీపై మరో 9 కేసులు ఉన్నాయి. దీంతో, ఖురేషీ కూడా జైళ్లోనే ఉండనున్నారు.

సైఫర్ కేసు ఏంటంటే?

సైఫర్ కేసు (ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం) అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. 2023 మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఇమ్రాన్.. ప్రధాని పదవి నుండి వైదొలిగారు.


Similar News