రంజాన్ వేళ పాకిస్తాన్ ప్రజలకు ధరల భారం
కూరగాయలు మొదలుకొని, పాలు, పంచదార, సహా నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా మూడు రెట్ల కంటే ఎక్కువగా పెరిగాయని..
దిశ, నేషనల్ బ్యూరో: ముస్లింలకు పవితమైన రంజాన్ మాసం ఆదివారం ప్రారంభమైంది. అయితే, ఇది ముస్లిం దేశమైన పాకిస్తాన్ ప్రజల్లో మాత్రం పండుగ సందడి లేకుండాపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో అన్ని రకాల ఆహార పదార్థాలు, ఉత్పత్తులు భారీగా ఖరీదైపోయాయి. కూరగాయలు మొదలుకొని, పాలు, పంచదార, మాంసం, పప్పులు సహా నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా మూడు రెట్ల కంటే ఎక్కువగా పెరిగాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్య ఆదాయ వర్గాల ప్రజలు అవసరమైన వాటిని కూడా ఎంతో కష్టంగా కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. అవకాశాన్ని వాడుకుంటున్న కొందరు వ్యాపారుల కారణంగా కూడా దేశవ్యాప్తంగా ధరలు గణనీయంగా పెరిగేందుకు కారణమని, దీనివల్ల తక్కువ ఆదాయ వర్గ ప్రజలు పూర్తిగా ఆర్థిక కష్టాల్లో మునిగిపోతున్నారన్నారు.
గత కొన్ని నెలల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా కూరగాయలు, సరుకుల సాధారణ పెరుగుదల 31.5 శాతం ఉండేది. కానీ, పండుగ దగ్గరపడుతున్న తరుణంలో చాలా రకాల ఆహార పదార్థాలు పండుగకు ముందు ఉన్న దానికంటే 60 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో కిలో ఉల్లి ధర 150 పాకిస్తానీ రూపాయల(పీకేఆర్) నుంచి 300 పీకేఆర్‌కి పెరిగింది. బంగాళదుంప కిలో 50పీకేఆర్ నుంచి 80 పీకేఆర్‌కు చేరింది. క్యాబేజీ 100పీకేఆర్ నుంచి 150పీకేఆర్‌కు, పచ్చి మిర్చి కిలో 200పీకేఆర్ నుంచి 320పీకేఆర్, క్యాప్సికం ఏకంగా రెండింతలు పెరిగి 400పీకేఆర్‌కు చేరింది. కూరగాయల ధరలతో పాటు వివిధ రకాల పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. అరటిపండ్ల ధర డజన్‌కు 80పీకేఆర్ నుంచి 120 పీకేఆర్‌కు పెరిగింది. యాపిల్స్ కిలో 150పీకేఆర్ నుంచి 200-250పీకేఆర్, పుచ్చకాయల ధర(రంజాన్‌లో ఎక్కువ గిరాకీ కలిగిన పండు) 120పీకేఆర్ నుంచి 200పీకేఆర్‌కు చేరింది.