Padma awards 2023: చినజీయర్, కీరవాణికి ‘పద్మ’ అవార్డులు
‘పద్మ’ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఘనంగా జరిగింది...
న్యూఢిల్లీ: ‘పద్మ’ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 106 మందికి అవార్డులను ప్రకటించగా, ఇందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. గత నెల 22న తొలి విడతలో భాగంగా 50 మందికి పైగా పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. మిగిలిన అవార్డు గ్రహీతలందరికీ బుధవారం అందజేశారు.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి అధ్యాత్మిక విభాగంలో చిన్న జీయర్(తెలంగాణ) పద్మ భూషణ్ అందుకోగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి(ఏపీ) పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక, సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు (మరణాంతరం) ప్రకటించిన పద్మవిభూషణ్‌ను ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్వీకరించారు. మిగతావారికి సైతం అవార్డులను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.