ఆప్ వర్సెస్ బీజేపీ.. సీఎంలు కేజ్రీవాల్, మాన్ నిరసన.. ఢిల్లీలో ఉద్రిక్తత

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి.

Update: 2024-02-02 16:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఆప్ తరఫున ఏకంగా ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ ఈ నిరసనల్లో పాల్గొనడంతో ఇరు పార్టీల కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ అక్రమంగా గెలిచిందని ఆరోపిస్తూ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌కు ఈడీ సమన్ల జారీని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి ఆప్‌ పిలుపునిచ్చింది. దీనికి పోటీగా బీజేపీ క్యాడర్ కూడా ఢిల్లీ సీఎం నివాసం వైపుగా దూసుకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీకి చెందిన 60 మందిని, ఆప్‌కు చెందిన 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరవుతూ .. తనను బాధితుడిగా చెప్పుకొని సానుభూతి పొందే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

దేశాన్ని అమ్మేయడానికి బీజేపీ వెనకాడదు : కేజ్రీవాల్ 

‘‘స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన బీజేపీ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం దేశాన్ని అమ్మేయడానికి కూడా వెనకాడదు. కానీ మేం ఆ పని చేయనివ్వం. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడతాం’’ అని ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ కామెంట్ చేశారు. ‘‘నిరసన కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఆప్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వందలాది మంది ఆప్ కార్యకర్తలను నిర్బంధించారు’’ అని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపును సవాల్ చేస్తూ ఆ నగరానికి చెందిన ఆప్‌ కౌన్సిలర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై అత్యవసర విచారణ చేయాలని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పిటిషన్‌ను జాబితాలో చేర్చి, విచారణ చేపడతామని తెలిపింది.

Tags:    

Similar News