మోడీజీ.. అదానీ, అంబానీలను అరెస్టు చేయించరా ? : ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ‘‘అదానీ, అంబానీల నుంచి టెంపోల నిండా రాహుల్ గాంధీ డబ్బుకట్టలు తెచ్చుకున్నారు’’ అంటూ ప్రధాని మోడీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఒకవేళ ప్రధాని మోడీ చేస్తున్న ఆరోపణలే నిజమైనవి అయితే.. ఇప్పటిదాకా అదానీ, అంబానీలను ఎందుకు అరెస్టు చేయించలేదని ప్రశ్నించారు. కేవలం హేమంత్ సోరెన్ లాంటి విపక్ష నేతలను అరెస్టు చేయించడంలోనే ప్రధాని మోడీ సర్కారు అత్యుత్సాహాన్ని చూపిస్తోందని విమర్శించారు. సోమవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ దేశ ప్రధాని అయితే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు జరగవని ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతుందన్నారు. ఎన్నికల బాండ్లను కొని బీజేపీకి చందాలు ఇచ్చిన వాళ్లకే ధందాలు (కాంట్రాక్టులు) ఇచ్చిన కల్చర్ పీఎం మోడీది అని ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు అరెస్టు చేయించిన విపక్ష నేతలందరికీ విముక్తి లభిస్తుందని వెల్లడించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన కామెంట్ చేశారు.