Old Man: హత్య కేసులో దోషి.. 36 ఏళ్ల తర్వాత 104 ఏళ్ల వృద్ధుడు జైలు నుంచి రిలీజ్
ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న 104 ఏళ్ల వృద్ధుడు 36 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు (Life imprisonment) అనుభవిస్తున్న 104 ఏళ్ల వృద్ధుడు 36 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని మాల్డా కరెక్షనల్ జైలు నుంచి బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మాల్టా జిల్లాలోని మానిక్ చక్ ప్రాంతానికి చెందిన రసిక్ చంద్ర మోండల్ (Rasik Chandra mondal) అనే వ్యక్తి ఓ భూవివాదం నేపథ్యంలో 1988లో తన సోదరుడిని హత్య చేశాడు. అనంతరం కోర్టు ఆయనను దోషిగా తేల్చి 1994లో జీవితఖైదు విధించింది. ఆ టైంలో మోండల్ వయస్సు 68 సంవత్సరాలు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. పలుమార్లు కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఈ క్రమంలోనే 2020లో తన వయస్సు, తీవ్రమైన ఆరోగ్య సమస్యల దృష్యా సుప్రీంకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం 2021 మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మోండల్ ఆరోగ్యానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. గత నెల 29న ఈ పిటిషన్ సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna), జస్టిస్ సంజయ్ కుమార్ (Sanjay kumar)లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మోండల్ వయస్సును దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు వద్ద మోండల్ మీడియాతో మాట్లాడుతూ తోటపని చేస్తూ జీవితం గడుపుతానని చెప్పారు. జైలుకు ఎప్పుడు వచ్చానో గుర్తు లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, మోండల్ 1920లో జన్మించారు.