ప్రధాని మోడీకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్
ఒడియా శాస్త్రీయ భాష అయినా సరే దాన్ని మీరు మరిచిపోయారని విమర్శలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఎలాంటి పేపర్లు చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలని ప్రధాని మోడీ చేసిన సవాల్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన.. ఒడిశా గురించి మీకెంత తెలుసు? అని ప్రశ్నించారు. ఒడియా శాస్త్రీయ భాష అయినా సరే దాన్ని మీరు మరిచిపోయారని విమర్శలు చేశారు. సంస్కృత భాష కోసం మీరు రూ. 1,000 కోట్లు కేటాయించారు. కానీ ఒడియాకు సున్నా కేటాయింపులు జరిగాయి. అంతేకాకుండా ఒడిస్సి సంగీతాన్ని కూడా ప్రధాని మోడీ మర్చిపోయారు. క్లాసికల్ ఒడిస్సీ సంగీతానికి గుర్తింపు కోసం తాను రెండుసార్లు ప్రతిపాదనలు పంపానని, వారిని తిరస్కరించారని నవీన్ పట్నాయక్ విమర్శించారు. అన్ని వనరులు ఉన్నా ఒడిశా ఎందుకు సంపన్నవంతం కాలేదు, ప్రజలెందుకు పేదలుగా ఉన్నారు? అని మోడీ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ.. ఒడిశా సహజ సంపద బొగ్గు. ఒడిశా బొగ్గును తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గడిచిన పదేళ్ల నుంచి దానిపై రాయల్టీ పెంచడం మర్చిపోయిందని విమర్శించారు. ఇదే సమయంలో కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఒడిశాను గుర్తుపెట్టుకోవడం వల్ల మోడీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. ఇటీవల భారతరత్న అవార్డు ఇచ్చినప్పుడు ఒడిశా వీర కుమారులను గౌరవించడం ఎందుకు మరిచిపోయిందని మోడీ ప్రభుత్వాన్ని సీఎం దుయ్యబట్టారు. మరో పదేళ్లు అయినా సరే ఏమీ జరగదు. ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ ఎప్పటికీ గెలుచుకోలేదని, ఆరోసారి బీజేడీ ప్రభుత్వమే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.