షార్ట్స్, చిరిగిన జీన్స్ ధరించారో.. ఈ టెంపుల్‌లోకి రానివ్వరు
దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో జనవరి 1 నుంచి సంప్రదాయ డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో జనవరి 1 నుంచి సంప్రదాయ డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. జగన్నాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులు టోర్న్ జీన్స్, హాఫ్ ప్యాంట్స్, షార్ట్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సులు ధరించరాదనే నిబంధనను మొదటిరోజు పక్కాగా అమలు చేశారు. అలాంటి దుస్తుల్లో వచ్చే వారికి స్వామివారి దర్శన అవకాశం కల్పించడం లేదని ఆలయ అధికార వర్గాలు వెల్లడించాయి. గుట్కా, పాన్ తినడంపైనా పూరి జగన్నాథ్ ఆలయం పరిసరాల్లో బ్యాన్ అమలు చేస్తున్నామని తెలిపాయి. ఆలయ పరిసరాలు, ప్రాంగణాల్లో ప్లాస్టిక్, పాలిథీన్‌ను ఎవరూ వాడకుండా నిరోధిస్తున్నామని చెప్పాయి. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. కొత్త సంవత్సరం మొదటిరోజు కావడంతో ఆలయాన్ని ఆదివారం అర్ధరాత్రి 1.40 గంటలకే తెరిచారు. సోమవారం ఒక్కరోజే 2 లక్షల మందికిపైగా భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు.