ఏప్రిల్ 2 వరకు జైలులోనే సీఎం కేజ్రీవాల్ ?!

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు.

Update: 2024-03-27 13:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. తనను ఈడీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించడాన్ని సవాల్ చేస్తూ గత శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. తనకు మధ్యంతర బెయిల్‌‌ను మంజూరు చేయాలని కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేసినప్పటికీ న్యాయస్థానం దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ తమకు మంగళవారమే అందిందని.. దాన్ని అధ్యయనం చేసి బదులిచ్చేందుకు మూడువారాల గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే అంత సమయం ఇవ్వలేమన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ పిటిషన్‌పై అధ్యయనం చేసి బదులిచ్చేందుకు ఏప్రిల్ 2 వరకు ఈడీకి అవకాశాన్ని కల్పించింది. అంటే అప్పటివరకు కేజ్రీవాల్ జైలు లేదా ఈడీ కస్టడీలో ఉండే అవకాశం ఉంది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జైలులో లేరు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఉన్న లాకప్‌లో ఉన్నారు. కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ గడువు గురువారంతో ముగియనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తదుపరిగా కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండాలా ? తీహార్ జైలులో ఉండాలా ? బెయిల్ పొందొచ్చా ? అనేదానిపై ఆ కోర్టే ఆదేశాలు జారీ చేయనుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు శుక్రవారం మధ్యాహ్నం వెలువడనున్న రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలపైకి మళ్లింది.

విచారణలో జాప్యం చేసేందుకే ఈడీ టైం అడిగింది : ఆప్ 

ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనలను కౌంటర్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ ప్రతివాదనలు వినిపించారు. ‘‘విచారణలో జాప్యం చేసే వ్యూహంతోనే పిటిషన్‌పై బదులిచ్చేందుకు ఈడీ మరింత సమయం అడుగుతోంది’’ అని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి సరైన ప్రాతిపదిక ఏదీ లేదని దీనిపై హైకోర్టు చొరవచూపి తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మార్చి 23నే తాము హైకోర్టులో పిటిషన్ వేశామని, అప్పటి నుంచే పిటిషన్‌తో ముడిపడిన సమాచారం అందుబాటులోకి వచ్చినా, ఈడీ తరఫు న్యాయవాది అందలేదని చెప్పడం సరికాదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అన్నారు. ‘‘ఈడీ రిమాండ్‌కు అప్పగించడాన్ని సీఎం కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు. గురువారంతో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగియబోతోంది. ఆలోగా హైకోర్టు తగిన నిర్ణయం ప్రకటించాలి’’ అని రిక్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News