సీఏఏతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుతో భారతీయులెవరూ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Update: 2024-04-08 09:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుతో భారతీయులెవరూ పౌరసత్వాన్ని కోల్పోరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన నమక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సోమవారం రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీలు సీఏఏ అంశంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ‘సీఏఏ తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాం. ఈ చట్టం వల్ల భారతదేశంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఇతర ఏ మతానికి చెందిన వారైనా పౌరసత్వం కోల్పోరు’ అని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని వెల్లడించారు. అందులో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370, సీఏఏలు ప్రధానమైనవని చెప్పారు. మహిళలపై ఏ అఘాయిత్యం జరిగినా వారికి అండగా ఉంటామని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ఆర్థిక, రక్షణ రంగాలతో సహా వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ‘భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు. దేశంలోని సైన్యం, వైమానిక దళం నౌకాదళంపై బలమైన విశ్వాసం ఉంది. ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడినా వారికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది’ అని అన్నారు. దేశంలో యుద్ధ విమానాలతో సహా ప్రతిదీ తయారు చేయగలుగుతున్నామని వెల్లడించారు. బీజేపీ దేశం కోసం పని చేస్తే కాంగ్రెస్, డీఎంకేలు వారి కుటుంబం కోసం పని చేస్తాయని ఆరోపించారు. 

Tags:    

Similar News