సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఎప్పటికీ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో రాజీపడబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను ఎప్పటికీ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో రాజీపడబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించడం సార్వభౌమ హక్కు. కాబట్టి సీఏఏను వెనక్కి తీసుకోము’ అని చెప్పారు. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామంటున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో వారు గెలవడం అసాధ్యం. ఆ విషయం వారికి కూడా తెలుసు. సీఏఏను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిని రద్దు చేయడం అంత సులువు కాదు. సీఏఏపై దేశమంతా అవగాహన కల్పిస్తాం. దానిని రద్దు చేయాలనుకునే వారికి దేశంలో స్థానం లభించదు’ అని అన్నారు. సీఏఏ ద్వారా బీజేపీ కొత్త ఓటు బ్యాంకును సృష్టిస్తు్ందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ..ప్రతిపక్షాలకు వేరే పని లేకుండా పోయిందని విమర్శించారు.
ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకూడదా?
సర్జికల్ స్ట్రైక్స్, వైమాణిక దాడులతో రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి, మరి ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, మమత, కేజ్రీవాల్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘బీజేపీకి స్పష్టమైన ఎజెండా ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం. సీఏఏ బిల్లును 2019లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించాం. కొవిడ్ కారణంగా ఇది ఆలస్యమైంది. ఎన్నికలలో పార్టీకి ఆదేశం రాకముందే ఎజెండాను క్లియర్ చేశాం’ అని తెలిపారు.