టీఎంసీలో ఎలాంటి వర్గాలూ లేవు: అభిషేక్ బెనర్జీ స్పష్టత
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలున్నాయని వస్తున్న ఊహాగానాలకు అభిషేక్ చెక్ పెట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలున్నాయని వస్తున్న ఊహాగానాలకు అభిషేక్ చెక్ పెట్టారు. టీఎంసీలో ఎలాంటి వర్గాలూ లేవని స్పష్టం చేశారు. పార్టీలో వృద్దులు, యువ నేతల మధ్య విభేదాలు లేవని తేల్చిచెప్పారు. కొందరు కావాలనే టీఎంసీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అభిషేక్ కొంత కాలంగా పార్టీ సమావేశాల్లో పాల్గొనలేదు. దీంతో మమతాతో ఆయనకు విభేదాలు తలెత్తాయని పుకార్లు వ్యాపించాయి. అలాగే ఇటీవల ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా టీఎంసీ 48 గంటల నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి సైతం అభిషేక్ గైర్హాజరయ్యారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్న విషయం నిజమేనని పలు కథనాలు వెలువడగా..తాజాగా అభిషేక్ క్లారిటీ ఇచ్చారు. అయితే అభిషేక్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఈ ప్రకటనలపై పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఆసక్తి లేదని, రాష్ట్రంలో టీఎంసీ గద్దె దించాలని తెలిపారు.