ఢిల్లీ కోర్టులో ఆప్ చీఫ్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టులో బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Update: 2024-06-01 12:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టులో బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న ఈ కేసులో నిర్ణయం తీసుకోనుంది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కు సంబంధించిన కేసుపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తనను ఈడీ అధికారులు అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకెక్కారు. ఆ కేసులో విచారణ ఆలస్యం అయ్యింది. దీంతో, ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. శనివారంతో ఆ గడువు ముగిసింది.

బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. విచారణ సమయంలో కేజ్రీవాల్‌ కు ఈడీ బెయిల్ వ్యతిరేకించింది. ఆయన తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆరు కిలోలు తగ్గినట్లు కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారని గుర్తుచేశారు. కానీ, జైళ్లో ఉన్నసమయంలో కేజ్రీవాల్ కిలో బరువు పెరిగారని తెలిపారు. వైద్యపరీక్షలు చేయించుకోకుండా దేశమంతా పర్యటిస్తున్నారని వెల్లడించారు. మధ్యంతర బెయిల్ పొడిగింపు కాకుండా సాధారణ బెయిల్ పొందే స్వేచ్ఛను సుప్రీంకోర్టు ఆయనకు ఇచ్చిందని వాదించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆదివారం జైళ్లో లొంగిపోతానని ఆయన అన్న మాటలను ఎత్తి చూపారు. కేజ్రీవాల్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. లొంగిపోయే తేదీపై సుప్రీంకోర్టు ఆదేశాలను సవరించవద్దని కోర్టుని ఈడీ తరఫు న్యాయవాది కోరారు.


Similar News