సమ్మెకు దిగనున్న రైల్వే ఉద్యోగులు
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్‌తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె
దిశ, నేషనల్ బ్యూరో: రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్‌తో ఈ ఏడాది మే 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నామని, మార్చి 19న అన్ని జోన్‌లలోని జనరల్ మేనేజర్లకు సమ్మె నోటీసులను అందజేయనున్నట్టు ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ కార్యదర్శి మర్రి రాఘవయ్య వెల్లడించారు. ఇదే సమయంలో సమ్మెకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అనుబంధ సంఘలకు రాఘవయ్య పిలుపునిచ్చారు.