శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి చంపే నవభారతమిది : మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తీవ్రవాదంపై పోరులో మెతకగా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తీవ్రవాదంపై పోరులో మెతకగా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా నవభారతాన్ని నిర్మించామన్నారు. శత్రు భూభాగంలోకి ప్రవేశించి.. శత్రుమూకలను చీల్చి చెండాడడానికి నేటి నవభారతం వెనుకాడదని ప్రధాని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని చురులో జరిగిన ఎన్నికల సభలో మోడీ ప్రసంగించారు. ‘‘పాకిస్తాన్‌పై మా ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేయించినప్పుడు.. మా బలగాల పరాక్రమానికి రుజువులు చూపించమని కాంగ్రెస్ అడిగింది. సైన్యాన్ని అవమానించడం, దేశాన్ని విభజించడం కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి అధికారంలో ఉండగా భారత బలగాల చేతులను కట్టేసింది. మన దేశంపై దాడి జరిగినప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి సైనికులకు కాంగ్రెస్ సర్కారు గతంలో స్వేచ్ఛ ఇవ్వలేదు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఇది మోడీ నవ భారతదేశం
‘‘సరిహద్దుల్లో మేం సైన్యానికి స్వేచ్ఛను ఇచ్చాం. భారత బలగాలకు వన్ ర్యాంక్, వన్ పెన్షన్ కల్పించాం. ఇది మోడీ నవ భారతదేశం అని శత్రు దేశాలకు తెలుసు. మేం శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి వారిని చంపుతాం’’ అని మోడీ చెప్పారు. దేశ ప్రయోజనాల కంటే బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్‌కు ముఖ్యమని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోందన్నారు. గత పదేళ్లలో ఈడీ దాడులు చేసి అవినీతిపరుల నుంచి రూ.లక్ష కోట్లు విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుందని మోడీ తెలిపారు. ఎన్నికల వేళ ఇండియా కూటమి చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు మోడీ భయపడడని గుర్తుంచుకోవాలని సూచించారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, విద్యుత్తు, ఉచిత రేషన్‌ను కేంద్ర సర్కారు అందజేస్తోందన్నారు.