ఈపీఎఫ్ఓ నిబంధనల్లో కీలక మార్పు
వైద్య ఖర్చుల కోసం ఉద్దేశించిన ఆటో క్లెయిమ్ పరిమితిని రెట్టింపు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఈపీఎఫ్ అకౌంట్ విత్‌డ్రాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక మార్పు తీసుకొచ్చింది. సాధారణంగా ఈపీఎఫ్ ఖాతాలో జమయ్యే మొత్తం నుంచి అత్యవసర పరిస్థితుల కోసం చందాదారులు పాక్షికంగా లేదంటే మొత్తం విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. విద్య, వైద్యం, ఇంటి నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు ఇందులోంచి కొంత మొత్తం విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి మార్పులు చేస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. వైద్య ఖర్చుల కోసం ఉద్దేశించిన ఆటో క్లెయిమ్ పరిమితిని రెట్టింపు చేసింది. దీనికి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 68జే పేరా కింద ఆటో క్లెయిమ్ సెటిల్‌మెట్ పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచుతున్నట్టు పేర్కొంది. చందాదారులు వ్యక్తిగతం లేదంటే కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదును తీసుకోవచ్చు. నెల లేదా అంతకంటే ఎక్కువ రొజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న, శస్త్ర చికిత్సలు చేయించినా ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే, క్షయ, టీబీ, క్యాన్సర్, పక్షవాతం వంటి చికిత్సల నిమిత్తం క్లెయిమ్ చేసుకునే వీలుంది. ఆన్‌లైన్‌లో సైతం విత్‌డ్రా వెసులుబాటు ఉంది. మెడికల్ సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా కూడా పొందే వీలుంది. అయితే, ఉద్యోగి ఆరు నెలల బేసిక్ పే, డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా.. రెండిట్లో ఏది తక్కువైతే అంత మొత్తం మాత్రమే విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.