Rahul Gandhi: కశ్మీర్‌లో శాంతి స్థాపనలో కేంద్రం విఫలం
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జమ్ము కశ్మీర్(Jammu Kashmir)లో శాంతి, సుస్థిరతలు స్థాపించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే బాధ్యత వహిస్తూ చర్యలు తీసుకోవాలని, జవాన్లకు, పౌరుల భద్రతను బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్(Gulmarg Terror Attack)లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గురువారం జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పోర్టర్లు మరణించారు.
జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ వాహనం(Army Vehicle)పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో జవాన్లు, పోర్టర్ల మరణం కలిచివేసిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలు జమ్ము కశ్మీర్‌లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రం చెబుతున్న మాటలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు నిత్యం ఉగ్రవాదుల ముప్పులో నివసిస్తున్నారని, జవాన్లు, పౌరులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.