కాంగ్రెస్ ప్రయత్నాలకు NCP గండి.. కూటమి ఐక్యత దెబ్బతీసేలా భారీ స్కెచ్!

2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో యూపీఏ కూటమిలోని కీలక భాగస్వామి ఎన్సీపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.

Update: 2023-04-18 08:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో యూపీఏ కూటమిలోని కీలక భాగస్వామి ఎన్సీపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మహా వికాస్ అఘాడీ పేరుతో అధికారం ఏర్పాటు చేసిన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌తో స్నేహం చేసిన ఎన్సీపీ ఇటీవల తన స్వరం మారుస్తోంది. కూటమి స్టాండ్ కు విరుద్ధంగా ఆ పార్టీ ముఖ్యనేతలు వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతున్నారు. దీంతో 'మహా' రాజకీయాల్లో కీలక మార్పు సంభవించబోతోందనే చర్చ మరాఠ పాలిటిక్స్ లో జోరుగా జరుగుతోంది. త్వరలో ఎన్సీపీ.. కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీతో జత కట్టబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ తమ పార్టీలోకి వస్తే స్వాగతమిస్తామని ఉదయ్ సామంత్ అన్నారు. అజిత్ ఎన్సీపీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల అదానీ వ్యవహారంపై ఎన్సీపీ చీఫ్ షరద్ పవార్ సైతం కాంగ్రెస్ స్టాండ్‌కు విరుద్ధంగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ముఖ్యనేతల వైఖరి ఆసక్తిని రేపుతున్నది.

ఇంతలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ అధికార కూటమిలో చేరబోతున్నారనే ప్రచారం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నది. తిరిగి పవర్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు గత కొంత కాలంగా ఎన్సీపీ ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యంగా అజిత్ పవార్ అధికార కూటమిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్నారనే ఊహాగానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల వ్యవహరిస్తున్న తీరు సైతం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది. అయితే అజిత్ పవార్ నిర్ణయం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ మరోసారి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ తరుణంలో విపక్ష కూటమికి చెందిన బలమైన పార్టీల్లో ఒకటైన ఎన్సీపీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థి కూటమిని దెబ్బ తీయవచ్చని అందులో భాగంగానే అజిత్ పవార్ ను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు మహారాష్ట్ర బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ గుప్పుమంటోంది. ఇదిలా ఉంటే ఎన్నికలు జరిగిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకోగా ఎన్సీపీ రూపంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతున్నది.

Tags:    

Similar News