Natural Cancer Treatment: క్యాన్సర్ ఫైనల్ స్టేజ్.. నా భార్యను అలా బ్రతికించుకున్నా : నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఆమె దినచర్యలో నిమ్మరసం, పచ్చి పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి, సిట్రస్ పండ్లు, గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్ రూట్, వాల్ నట్ వంటి రసాలను చేర్చామని, అలాగే వంటకోసం కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, బాదం నూనెను మాత్రమే వాడామన్నారు.
దిశ, వెబ్ డెస్క్: బ్రతకడానికి 97 శాతం అవకాశం కూడా లేని తన భార్య.. క్యాన్సర్ నుంచి కోలుకుందని పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu)ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టా ఖాతా నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందుకు కారణం సనాతన వైద్య చిట్కాలేనని ఆయన చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అమృత్ సర్ లో తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ విషయాలను వెల్లడించారు. జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా స్టేజ్ 4 క్యాన్సర్ ను జయించినట్లు చెప్పుకొచ్చారు. తన డైట్ లో కొన్ని మార్పులు చేయడం వల్లే తన భార్య 40 రోజుల్లోనే క్యాన్సర్ (Cancer Treatment) నుంచి కోలుకుందన్నారు. నిజంగా డైట్ లో మార్పులు చేస్తే క్యాన్సర్ నుంచి కోలుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. తాము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారో వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ స్టేజ్-4 ఇన్వెసివ్ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఆమెకు అరుదైన రొమ్ము శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారన్నారు. దాదాపు ఏడాదికాలంగా రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్న నవజ్యోత్ కౌర్.. దానిని జయించేందుకు చికిత్స తీసుకుంది. పాటియాలాలోని ప్రభుత్వ రాజేంద్ర మెడికల్ కాలేజీ సహా.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ చికిత్స తీసుకుందన్నారు. కానీ.. బ్రతికేందుకు 3 శాతం మాత్రమే అవకాశాలున్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డైట్ లో (Natural Cancer Therapy) మార్పులు చేశామని తెలిపారు.
ఆమె దినచర్యలో నిమ్మరసం, పచ్చి పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి, సిట్రస్ పండ్లు, గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్ రూట్, వాల్ నట్ వంటి రసాలను చేర్చామని, అలాగే వంటకోసం కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, బాదం నూనెను మాత్రమే వాడామన్నారు. ఉదయం తీసుకునే టీ లో దాల్చిన చెక్క, లవంగాలు, బెల్లం, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలనే వాడామన్నారు.
క్యాన్సర్ పేషంట్ భోజన సమయాల్లో మార్పులొస్తే.. షుగర్, కార్బోహైడ్రేట్స్ (Carbohydrated Foods) ఉన్న ఆహారాలను ఇవ్వొద్దన్నారు. అప్పుడే క్యాన్సర్ కణాలు ఆటోమేటిక్ గా చనిపోతాయన్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. సాయంత్రం 6 గంటలకు ముందు భోజనం చేయాలని, మరుసటిరోజు ఉదయం 10 గంటలకు నిమ్మరసంతో రోజును ప్రారంభించాలని తెలిపారు. నిమ్మరసం తాగిన అరగంటకు 10-12 వేప ఆకుల్ని ఇవ్వాలని సూచించారు.
ఇలా డైట్ ప్లాన్ పాటిస్తే.. కాలేయానికి పేరుకున్న కొవ్వు కరుగుతుందన్నారు సిద్ధూ. తనకున్న ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య తగ్గడంతో పాటు 25 కేజీల బరువు కూడా తగ్గానన్నారు. క్యాన్సర్, ఫ్యాటీ లివర్ సమస్యలున్నవారు వీటిని పాటిస్తే.. మంచి ఫలితాలుంటాయని, తన భార్య క్యాన్సర్ ను జయించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ట్రీట్మెంట్ లో తన భార్యను 24/7 కేరింగ్ గా చూసుకున్న యమునా నగర్ వర్యం సింగ్ ఆస్పత్రికి, డాక్టర్ వికూ బత్రా కు కృతజ్ఞతలు తెలిపారు.