దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష..ఆ సెంటర్‌లో తారుమారైన ప్రశ్నపత్రం

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి గాను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించింది.

Update: 2024-05-05 18:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి గాను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం నిర్వహించింది. దేశంలోని 557 నగరాలు, విదేశాల్లో 14 సిటీల్లో పరీక్ష జరిగింది. దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5:20 గంటలకు ముగిసింది. అయితే పరీక్ష ముగిసిన కాసేపటికే పేపర్ లీకైనట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఏ స్పందించి క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. అవి ఫేక్ వార్తలని కొట్టి పారేసింది. ఈ మేరకు ఎన్టీయే సీనియర్ అధికారి సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఇన్విజిలేటర్‌ తప్పును సరిదిద్దే సమయానికి విద్యార్థులు బలవంతంగా పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. రూల్స్ ప్రకారం విద్యార్థులు పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రంతో సహా సెంటర్ బయటకు వెళ్లాలి. కానీ కొంత మంది విద్యార్థులు సాయంత్రం 4గంటలకే బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరలైంది. అంతేతప్ప లీక్ కాలేదు. దేశ వ్యాప్తంగా పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ వైరలైంది’ అని పరాశర్ స్పష్టం చేశారు.

120 మందికి మళ్లీ పరీక్ష!

రాజస్థాన్‌లో జరిగిన పొరపాటుపై ఎన్టీఏ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయా సెంటర్లలోని 120 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. పారదర్శకత, సమగ్రత, నిష్పక్షపాతంగా పరీక్షలను నిర్వహించేందుకు ఎన్టీయే కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే మరొక తేదీ నిర్ణయించి బాధిత విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 23లక్షల మంది అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షకు అప్లై చేశారు. అందులో 10లక్షల మంది అబ్బాయిలు ఉండగా..13లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. మరో 24 మంది విద్యార్థులు థర్డ్ జెండర్ కేటగిరీ కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3,39,125 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే పరీక్షకు ఎంత మంది హాజరయ్యారనే వివరాలను ఎన్టీయే వెల్లడించలేదు. 

Tags:    

Similar News