ముస్లిం సమాజం బీఎస్పీని ఆదరించలేదు.. మాయవతి అసంతృప్తి
లోక్ సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక పోయింది.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక పోయింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ చీఫ్ మాయవతి స్పందించారు. అత్యధికంగా ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినప్పటికీ వారు బీఎస్పీని అర్థం చేసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీదట ఆలోచించిన తర్వాతే ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పనితీరు వెనుక గల కారణాలను గుర్తించేందుకు లోతైన విశ్లేషణ జరుపుతామని వెల్లడించారు.
‘గత ఎన్నికల్లో, ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ముస్లిం సమాజానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాం. అయినప్పటికీ వారు బీఎస్పీని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. పార్టీ భవిష్యత్తులో భారీ నష్టాన్ని చవిచూడకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తాం’ అని చెప్పారు. పార్టీని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాగా, బీఎస్పీ 35 మంది ముస్లిం అభ్యర్థులను ఎన్నికల్లో బరిలో నిలిపింది. అయితే ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు మాయవతిని భారత కూటమిలో చేరాలని కోరారు. అయితే ఆమె వారి వాదనలను తిరస్కరించి ఒంటరిగానే బరిలోకి దిగింది.