ఎండ, వాన, చలిని సైతం లెక్క చేయకుండా ప్రజలు అండగా నిలిచారు: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశానని.. భారత్ జోడో యాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశానని.. భారత్ జోడో యాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని రైతుల కష్టాలు తెలిశాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్‌లో జరుగుతోన్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాక తనలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఊహించని మద్దతు లభించిందన్నారు.
ఎండ, వాన, చలిని సైతం లెక్క చేయకుండా ప్రజలు తనతో నిలబడ్డారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నాలుగు నెలలు ప్రజల్లోనే గడిపానని.. ఈ నాలుగు నెలల్లో తాను ఎంతో నేర్చుకున్నానని వివరించారు. దేశంలో రైతులు, పేద ప్రజలపై భారం పెరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయం ఉందని.. కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్‌లో మూడు రోజులు పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి.