బీజేపీకి బీ- టీమ్‌గా MIM.. కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఒవైసీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Update: 2022-11-26 12:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గుజరాత్‌లో బీజేపీ సుధీర్ఘకాలం అధికారంలో ఉండటానికి కాంగ్రెస్ పార్టీ చేతగానితనమే కారణం అని ఆరోపించారు. తమ పార్టీ పోటీ చేస్తున్న కచ్ జిల్లాలో ప్రచార పర్యటన అనంతరం మీడియా సంస్థతో మాట్లాడిన ఒవైసీ ఎంఐఎం 'ఓటు కట్టర్' (ఓట్లను చీల్చే) పార్టీ అనే ప్రచారాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై విమర్శలు చేస్తోందని గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్షంలో ఉందని అన్నారు.

ఇన్నాళ్లు బీజేపీని ఓడించి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ను ఎవరు ఆపారని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం రెండూ బీజేపీ బీ టీమ్‌లు అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఒవైసీ ఖండించారు. ఎంఐఎం ఎవరి ఓట్లు చీల్చడానికి ఇష్టపడటం లేదని కేవలం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకే మేం ఇక్కడికి వచ్చామన్నారు. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలు ఉన్నాయని తమ పార్టీ కేవలం 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని చెప్పారు. మిగతా 169 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికార బీజేపీ ప్రచారంలో యూనిఫాం సివిల్ కోడ్, మెహ్రౌలీ హత్య కేసు అంశాలను ప్రస్తావిస్తూ ముస్లిం వ్యతిరేక ప్రచారం లేవనెత్తుతోందని దుయ్యబట్టారు.

Tags:    

Similar News