ప్రపంచలోనే ఖరీదైన ఎన్నికలు.. దాదాపు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు
గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల్లో ఖర్చులు, ధనప్రవాహం భారీగా పెరిగిపోయింది. ఈ సారి ఎన్నికలకు ఏకంగా రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు అయినట్లు అంచనా.
దిశ, నేషనల్ బ్యూరో: గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల్లో ఖర్చులు, ధనప్రవాహం భారీగా పెరిగిపోయింది. ఈ సారి ఎన్నికలకు ఏకంగా రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు అయినట్లు అంచనా. ఈ ఖర్చు ఒక రాష్ట్ర బడ్జెట్ తో సమానం. అంతేకాదు ప్రపంచ దేశాల్లోనే ఇవే అత్యంత ఖరీదైన ఎన్నికలు అని తెలుస్తోంది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకారం, భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లుగా ఉంది. ఓటర్లను గెలుచుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సహా అన్ని పార్టీలు విచ్చలవిడిగా ఖర్చులు చేసినట్లు నివేదిక తెలిపింది.
2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు.. 60 వేల కోట్లు. ఈసారి లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల్లో అయిన ఖర్చు రూ.1.2 లక్షల కోట్లు. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా కంటే మన ఎన్నికల ఖర్చు ఇంకో 15 వేల కోట్లు ఎక్కువ. ఇకపోతే, దేశంలో మొత్తం 96 వేల మంది ఓటర్లు ఉండగా.. ఒక్కో ఓటరుకు రూ.1400 ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల ఖర్చు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.