హోలీ వేళ మసీదులపై కవర్లు.. ‘లాత్ సాహబ్ బారాత్’, ‘రామ్ బారాత్’కు ఏర్పాట్లు
దిశ, నేషనల్ బ్యూరో : హోలీ పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో : హోలీ పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అలీగఢ్, బరేలీ, షాజహాన్‌పూర్‌లలోని సమస్యాత్మక ఏరియాల్లో ఉన్న మసీదులను పెద్దపెద్ద టార్పాలిన్ కవర్లతో కప్పేశారు. ఆయా చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. హోలీ పండుగ రోజే బరేలీ నగరంలో బ్రహ్మపురి రాంలీలా కమిటీ ఆధ్వర్యంలో ‘రామ్ బారాత్’ యాత్ర జరగనుంది. ఈ యాత్ర జరిగే ఏరియాల్లోని మసీదుల వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆయా మసీదుల నిర్వాహకులను సంప్రదించిన తర్వాతే ముందుజాగ్రత్త చర్యగా ప్రార్థనా స్థలాలపై టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేయించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ‘రామ్ బారాత్’ సందర్భంగా బరేలీలోని మసీదులపై రంగులు పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు.
‘లాత్ సాహబ్ బారాత్’ అంటే ?
యూపీలోని షాజహాన్‌పూర్‌లో ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా ‘లాత్ సాహబ్ బారాత్’ జరుగుతుంటుంది. లాత్ సాహబ్ బారాత్‌లో భాగంగా దున్నపోతుల బండిపై ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మొత్తం పట్టణంలో ఊరేగిస్తారు. ఈక్రమంలో అతడిపై చెప్పులు, చీపుర్లు విసురుతారు. రంగులు చల్లుతారు. ఈక్రమంలో ‘లాత్ సాహబ్ బారాత్’ జరిగే మార్గంలోని ప్రార్థనా మందిరాలపైకి అవి పడే అవకాశం ఉంది. ఇందువల్లే యాత్ర జరిగే మార్గంలోని మసీదులను పెద్ద టార్పాలిన్ కవర్లతో కప్పేశారు. కాగా, 17వ శతాబ్దం నుంచే లాత్ సాహబ్ బారాత్‌ను షాజహాన్‌పూర్‌లో నిర్వహిస్తుండటం విశేషం.