మణిపూర్ ఆవేదనను మోడీ వినాలి..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి

ఏడాది కాలంగా హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో మణిపూర్ అల్లకల్లోలంగా ఉందని, ఆ రాష్ట్ర ప్రజల ఆవేదనను ప్రధాని మోడీ వినాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-07-11 18:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఏడాది కాలంగా హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో మణిపూర్ అల్లకల్లోలంగా ఉందని, ఆ రాష్ట్ర ప్రజల ఆవేదనను ప్రధాని మోడీ వినాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. జాలి హింసతో దెబ్బతిన్న మణిపూర్‌ను వెంటనే సందర్శించాలని సూచించారు. ఈ మేరకు ఇటీవల మణిపూర్ లో పర్యటించిన రాహుల్ అక్కడి ప్రజల బాధను వివరిస్తూ.. ఓ ఐదు నిమిషాల వీడియోను గురువారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. మణిపూర్ ఇంకా కష్టాల్లోనే ఉందని, అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. వేలాది కుటుంబాలు సహాయ శిబిరాల్లో నివసించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత నేను రాష్ట్రాన్ని ఇప్పటికి మూడు సార్లు సందర్శించాను. కానీ దురదృష్టవశాత్తు అక్కడి పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయింది. కాబట్టి రాష్ట్రాన్ని వెంటనే స్వయంగా సందర్శించి, ప్రజల సమస్యలను విని శాంతి కోసం విజ్ఞప్తి చేయాలి’ అని మోడీని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు.


Similar News