తొలిసారి మీడియా ప్రశ్నలకు ఆన్సర్ చేయబోతున్న మోడీ!
ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలంలో తొలిసారి మీడియా ప్రశ్నకు బదులివ్వబోతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలంలో తొలిసారి మీడియా ప్రశ్నకు బదులివ్వబోతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి గురువారం మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ మీడియా నుండి ఒక ప్రశ్న, భారత్ మీడియా నుండి ఒక ప్రశ్నకు మోడీ బదులివ్వబోతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారు.
ఇది చాలా పెద్ద విషయం అని శ్వేత సౌధం అభివర్ణించింది. నిజానికి మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో ఒక్క విలేకరుల సమావేశంలో కూడా ప్రసంగించలేదు. 2019 మేలో ఆయన విలేకరుల సమావేశానికి హాజరయ్యారు కానీ విలేకరుల ప్రశ్నలకు స్పందించలేదు. భారత ప్రధాని కూడా తన విదేశీ పర్యటనలలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు తప్ప సాధారణంగా జర్నలిస్టుల నుండి ప్రశ్నలు తీసుకోరనే విమర్శలు ఉన్నాయి.
అయితే మోడీ మరియు బిడెన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాలనే వైట్ హౌస్ ప్రతిపాదనపై భారత అధికారులు మొదట అభ్యంతరం వ్యక్తం చేశారని యూఎస్ అధికారులు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా ప్రధాని మోడీది పూర్తిగా వన్ వే కమ్యూనికేషన్ అని స్వదేశంలో విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన మనసులో ఏముందో మన్ కీ బాత్ ద్వారా మాట్లాడుతారే తప్పా ప్రజల మనసులో ఉన్న విషయమేంటో వినరని ప్రత్యర్థుల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ అమెరికా పర్యటనలో మీడియా ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోందనేది ఆసక్తిగా మారింది.
Also Read..