One Nation One Election : జమిలి ఎన్నికల బిల్లులు.. కేంద్రం వెనుకడుగు ?

దిశ, నేషనల్ బ్యూరో : తొలుత డిసెంబరు 16న(సోమవారం) లోక్‌సభలో జమిలి ఎన్నికల(One Nation One Election) బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది.

Update: 2024-12-15 07:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తొలుత డిసెంబరు 16న(సోమవారం) లోక్‌సభలో జమిలి ఎన్నికల(One Nation One Election) బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. అయితే ఇప్పుడు ఆ విషయంలో మోడీ సర్కారు(Modi govt) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సోమవారం జరగనున్న లోక్‌సభ(Lok Sabha) సెషన్ కోసం రూపొందించిన బిజినెస్‌ లిస్టులను తాజాగా రివైజ్ చేశారు. వాటిలో నుంచి జమిలి ఎన్నికలతో ముడిపడిన రెండు బిల్లులను తొలగించారు. దీంతో జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్ర సర్కారు పునరాలోచనలో పడిందా అనే చర్చ మొదలైంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను బిజినెస్ లిస్టు నుంచి తొలగించారు. అయితే అకస్మాత్తుగా సప్లిమెంటరీ లిస్టులో ఈ బిల్లులను చేర్పించి, సోమవారం లోక్‌సభ ఎదుటకు వాటిని తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

ఈ నెల 20 (శుక్రవారం)తో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఒకవేళ సోమవారం రోజు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టకుంటే.. ఇక ఈ సెషన్‌లో వాటి గురించి ప్రస్తావన రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికల బిల్లులను తొలుత పార్లమెంటులో ప్రవేశపెట్టి.. అనంతరం వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఇక సోమవారం నుంచి రెండు రోజుల పాటు రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ చర్చను ప్రారంభిస్తారు. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర సర్కారుకు సిఫార్సు చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని మోడీ సర్కారు పక్కనపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈ నెల 12న కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News