ఈవీఎంల ట్యాంపరింగ్‌లో మోడీ నిమగ్నమయ్యారు: కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయమని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పందించారు.

Update: 2024-02-06 09:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయమని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను తారుమారు చేయడంలో ప్రధాని నిమగ్నమైనట్టు కనిపిస్తోందని ఆరోపించారు. మంగళవారం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ‘ఎవరైనా గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నారంటే.. ఈవీఎంలలో ఏమైనా రహస్యాలు దాచి ఉంచొచ్చు. మోడీ మాటలను బట్టి చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగక ముందే బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని మోడీ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 తీసేసినందుకు అన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారో ఏమో అని ఎద్దేవా చేశారు. దేశంలోని సంస్థలన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి స్వాధీనం చేసుకుంటున్నారని, చివరికి దేశ ఎన్నికలను కూడా ఎగతాళి చేస్తారేమోనని సందేహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఓటు వేయడానికి ముందే గెలిచే సీట్ల సంఖ్యను చెబుతుండటం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. ‘ఓట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కావు. కాబట్టి మోడీ అంత నమ్మకంతో సంఖ్యతో సహా ఎలా చెబుతున్నాడో తెలియట్లేదు. దీనికి ముందే అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని అర్థం చేసుకోవచ్చు’ అని చెప్పారు.  

Tags:    

Similar News